- అయితే సెక్రటరీ జైలుకు వెళ్లాల్సిందే!
- సభ్యులకు జరిమానా, కటకటాల ముప్పు
- ఆషామాషీ నిర్వహణ ఇక కుదరదు
- తేడా వస్తే బాధ్యత వెల్ఫేర్ కమిటీదే
- పటిష్ఠత లేకుంటే అపార్ట్‌మెంట్ సీజ్
- తగ్గిపోతున్న అపార్ట్‌మెంట్ల జీవితకాలం
- చంద్రలోక్ ఘటనతో అప్రమత్తం
- నిపుణులతో జీహెచ్‌ఎంసీ కమిటీ
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ: అపార్ట్‌మెంట్ సెక్రెటరీ అంటే ఎంతో గౌరవం... వెల్ఫేర్ సొసైటీ సభ్యుడైతే కనీసం మాట చెల్లే మర్యాద... అందుకే అపార్ట్‌మెంటులోని గృహస్థులు పైకి వద్దు వద్దంటూనే మెయింటెనెన్స్ పదవుల్లో చేరిపోతారు. బాధ్యతలు మాత్రం తీసుకోరు. కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినపుడు ఉలిపిరికట్టె లాంటి సభ్యుడొకరు అడ్డం పడతాడు. ఇగోల యుద్ధంలో ఆ నిర్ణయం మూలన పడుతుంది. మిగతా వాళ్లంతా మాకెందుకులే అని మౌనంగా ఉండిపోతారు. దాంతో అపార్ట్‌మెంట్ నిర్వహణ ఘోరంగా తయారవుతుంది. చివరికి అది ఏకంగా అపార్ట్‌మెంట్ పటిష్ఠతనే దెబ్బ తీస్తుంది. ఇలాంటి భవనాలు కాలం చెల్లక ముందే కూలిపోతే బాధ్యత ఎవరిది? ఇప్పటిదాకా ఎవరిదీ కాదు. ఇక నుంచి ‘వెల్ఫేర్ సొసైటీ’దే బాధ్యతని జీహెచ్‌ఎంసీ తేల్చి చెబుతోంది. భవనం వెల్ఫేర్‌ను మరచి అలంకార ప్రాయంగా కమిటీ పోస్టుల్లో కూర్చుంటే జరిమానాతో పాటు జైలుశిక్ష తప్పదని హెచ్చరిస్తోంది.
మూడు రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని చంద్రలోక్ కాంప్లెక్స్ ఎలివేషన్ ఊడిపడి రోడ్డుపై వెళుతున్న పౌరుడొకరు మృతి చెందారు.రాజధానిలో మెయింటెనెన్స్ సరిగా లేక వేల భవనాలు ప్రమాదకరంగా తయారయ్యాయని ఇప్పటికే జీహెచ్‌ఎంసీ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. చంద్రలోక్ ఘటనతో నగర పాలక సంస్థ అప్రమత్తమైంది. ఏళ్ల తరబడి నివాసముంటూ కనీస నిర్వహణ చేపట్టని సొసైటీ వెల్ఫేర్ కమిటీలపై చర్యలకు జీహెచ్‌ఎంసీ ఉపక్రమిస్తోంది. నిర్మాణదారుడి నుంచి భవనాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత అపార్ట్‌మెంట్ యజమానులు పరస్పర అంగీకారంతో ఏర్పాటు చేసుకునే వెల్ఫేర్ సొసైటీలు విధిగా ఇతర సంక్షేమ అంశాలతో పాటు భవన పటిష్ఠత పైనా దృష్టి పెట్టాలి. పలు సొసైటీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు సర్వేలో తేలింది. వాణిజ్య నివాస గృహ సముదాయాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అందుకే నిర్వహణ లోపాలకు వెల్ఫేర్ కమిటీ సభ్యులనే బాధ్యులను చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి త్వరలో జీహెచ్‌ఎంసీ ఒక నివేదికను పంపనుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించే సొసైటీల సభ్యులపై జరిమానాలు, లోపాల తీవ్రతను బట్టి కేసులు పెడతారు. ప్రమాదకర అపార్టుమెంట్లను సీజ్ చేస్తారు.
శిథిలావస్థకు చేరిన భవంతులకు అవసరమైన మరమ్మతులు చేయించని సొసైటీలపై ఒత్తిడి పెంచడం ద్వారా అందులో నివసించే ప్రజల సంరక్షణ చేపట్టాలనే లక్ష్యంతో కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు గ్రేటర్ ఉన్నతాధికారి తెలిపారు. అపార్ట్‌మెంట్ మెరుగైన నిర్వహణ కోసం ఎన్నేళ్లకోసారి రంగులు వేయాలి? లీకేజీలు ఏర్పడితే మరమ్మతులతోపాటు శాశ్వత పరిష్కారంగా ఏం చేయాలి? భవనం పటిష్ఠత తగ్గకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న దానిపై జేఎన్‌టీయు, ఓయూ ఇంజనీరింగ్ నిపుణుల బృందం విదివిధానాలు జీహెచ్‌ఎంసీకి అందించింది. వాటి ఆధారంగా సర్కిల్ స్థాయిలో ఆర్‌డబ్ల్యుఏలకు అవగాహన కల్పిస్తారు. త్వరలో ఇంజనీరింగ్ కమిటీ నగరంలోని రెండు, మూడు దశాబ్దాల కిందటి అపార్ట్‌మెంట్‌లను తనిఖీ చేసి పటిష్ఠతను నిర్ధారిస్తుంది. నివేదిక ఆధారంగా భవనాల నిర్వహణ, మరమ్మతు పనులు చేపట్టాలని వెల్ఫేర్ సొసైటీకి జీహెచ్‌ఎంసీ సూచిస్తుంది.
స్పందించకుంటే నోటీసు జారీ చేస్తారు. గడువు ముగియగానే భవనాన్ని సీజ్ చేస్తారు. పూర్తి బాధ్యత అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ సొసైటీదే. గ్రేటర్‌లో 2 లక్షలకుపైగా అపార్ట్‌మెంట్‌లు ఉంటాయి. ప్రతి అపార్ట్‌మెంట్‌లో వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసుకోవాలి. అధ్యక్షుడు, కార్యదర్శితో పాటు ఇతర కార్యవర్గాన్ని నమోదు చేసుకోవాలి. భవనం మెయింటెనెన్స్ ఈ కమిటీ బాధ్యత. చాలా అపార్ట్‌మెంట్‌లకు కమిటీలు లేవు. ఉన్నవీ సరిగా పనిచేయవు. కనీస బాధ్యతలు కూడా అవి తీసుకోవడం లేదు. లీకేజీల మరమ్మతు వెంటనే చేయకపోవడంతో సమస్య తీవ్రంగా మారుతోంది. రంగులు వేయక పోవడంతో శ్లాబ్‌ల పెచ్చులూడి కింద పడుతుంటాయి. ఇవన్నీ అపార్ట్‌మెంట్ జీవితకాలంపై ప్రభావం చూపుతున్నాయి. వాస్తవ జీవితకాలం కంటే ముందే శిథిలావస్థకు చేరుతున్నాయి. 44 ఏళ్ల క్రితం నిర్మించిన సికింద్రాబాద్‌లోని చంద్రలోక్ కాంప్లెక్స్ ఎలివేషన్ నిర్వహణ లోపం కారణంగానే కుప్పకూలింది. భవనం కూడా శిథిలావస్థకు చేరింది. ఏ క్షణాన్నయినా కూలిపోయే ప్రమాదముందంటూ ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు http://www.andhrajyothy.com/artical?SID=346068